
- ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు లేవు
- బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేస్తం
- ఆ తర్వాతే రీస్టోరేషన్ పనులు చేపడతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: డిజైన్‌లో, నిర్మాణంలో లోపాలు ఉంటే మొత్తం మేడిగడ్డ బ్యారేజీయే కొట్టుకుపోయేదని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అన్నారు. ఇసుకపై కట్టడంతోనే కొన్ని సమస్యలు వచ్చాయి తప్ప.. నిర్మాణ లోపాలు లేవని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై ఏం చేద్దాం.. ఎలాంటి చర్యలు చేపడదాం అనే విషయంపై ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లు, శంకర్, సీడీవో సీఈ మోహన్ కుమార్, ఇరిగేషన్ అడిషనల్ సెక్రటరీ భీం ప్రసాద్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో శుక్రవారం జలసౌధలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీని మోనోలిథిక్ డిజైన్‌తో నిర్మించామని, నిరుడు భారీ వరదలు పోటెత్తినా బ్యారేజీ తట్టుకొని నిలబడిందని గుర్తుచేశారు.
కాఫర్ డ్యామ్ నిర్మించి, వరదను మళ్లిస్తాం..
బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా నిర్మించామని, ఏడో బ్లాకులో పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో కొన్ని సమస్యలు తలెత్తాయని రజత్‌కుమార్ తెలిపారు. ఈ ఆరు పియర్ల స్థానంలో రీస్టోరేషన్ పనులు చేపట్టాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇందుకోసం మొదట కాఫర్ డ్యామ్ నిర్మించి, అక్కడికి వరద రాకుండా మళ్లిస్తామని, ఆ తర్వాత దాని చుట్టూ రింగ్ మెయిన్ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం పియర్లు కుంగడానికి గల కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన తర్వాతే పునరుద్ధరణ పనులు మొదలు పెడతామని తెలిపారు. పియర్ల కింద ఇసుక కదలడంతోనే బ్యారేజీలోని 8వ బ్లాక్ కుంగిపోయిందన్నారు.
బ్యారేజీ మరమ్మతులకు స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) అనుమతి సరిపోతుందని, కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీని సందర్శించిందని, వాళ్లు కోరిన వివరాలన్నీ ఇచ్చామని తెలిపారు. అన్ని పరిశోధనలు చేసిన తర్వాత పునరుద్ధరణ పనులు చేస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ శనివారం సందర్శించనుందని ఆయన తెలిపారు. ఈ ప్యానల్ బ్యారేజీలోని కుంగిన పియర్లను పరిశీలించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై నివేదిక ఇస్తుందని చెప్పారు.