ఇంట్లో చోరీ.. ఇద్దరి అరెస్ట్.. 19 తులాల బంగారం, 13 తులాల వెండి స్వాధీనం

ఇంట్లో చోరీ.. ఇద్దరి అరెస్ట్.. 19 తులాల బంగారం, 13 తులాల వెండి స్వాధీనం

గండిపేట, వెలుగు: ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరాంనగర్ కాలనీలో ఉండే వంశీధర్ రెడ్డి ఈ నెల 12న కుటుంబంతో కలిసి బయటికెళ్లాడు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికొచ్చాడు. లోపలికి వెళ్లి చూడగా.. రూ.లక్షా 20 వేల క్యాష్, బంగారం, వెండి నగలు, బీరువాలోని వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గుర్తించి స్థానిక పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. 

కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎల్. రాజు గౌడ్(38), ఎల్. శివ గౌడ్(32)ఈ చోరీ చేసినట్లు గుర్తించి మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు బానిసై వీరిద్దరు దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 19 తులాల బంగారం, 13 తులాల వెండి నగలు, బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.