
హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డాడు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ. ల్యాండ్ డాక్యుమెంట్ల విషయంలో ఐదున్నర లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తో పాటు ఇంట్లోనూ సోదాలు జరిపారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని గంధంగూడ బస్తీలో గౌరి అనే మహిళకు 300 గజాల స్థలం ఉంది. దానిని డెవలప్ చేయాలని గతంలో ఓ బిల్డర్‌కు అగ్రిమెంట్ చేశారు. అయితే బిల్డర్ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు.
దీంతో గౌరి తాను చేసిన అగ్రిమెంట్‌ను రద్దు చేయాలనుకుంది. వరుసకు కొడుకు అయ్యే అర్వింద్ కుమార్ ద్వారా రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ మీర్ హర్షద్ అలీని కలిశారు. అగ్రిమెంట్ రద్దు చేయాలంటే రూ.5.5 లక్షలు ఇవ్వాలని.. అందులో రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్‌కు, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ వాసుకు అని మాట్లాడుకున్నారు. గురువారం డాక్యుమెంట్ రైటర్ వాసు.. అర్వింద్‌కుమార్ దగ్గర రూ.5.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకోలేదని, కానీ రూ.5 లక్షలు ఇస్తేనే అగ్రిమెంట్‌ను రద్దు చేస్తామని అర్వింద్‌కుమార్‌తో మాట్లాడిన వివరాలు తమ వద్ద ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్ట్ చేశామని, వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామన్నారు.