Rajinikanth : 'కూలీ' నుండి 'మోనికా' సాంగ్ విడుదల.. గ్లామర్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే!

Rajinikanth : 'కూలీ' నుండి 'మోనికా' సాంగ్ విడుదల.. గ్లామర్‌తో అదరగొట్టిన పూజా హెగ్డే!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాల చిత్రం 'కూలీ' నుండి రెండో సింగిల్ విడుదలైంది. 'మోనికా' పేరుతో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన స్టేప్స్ తో అదరగొట్టింది. 'మోనికా' పాట విడుదల 'కూలీ' సినిమా ప్రమోషన్స్‌కు మరింత ఊపునిచ్చింది.  అభిమానులను ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.

'మోనికా' పాట ..  పూజా హెగ్డే గ్లామర్ షో!
'మోనికా' పాట ఒక ఉత్సాహభరితమైన, శక్తివంతమైన ట్రాక్‌గా అలరిస్తుంది. పాటలోని లిరిక్స్ 'మోనికా' అనే ఆకర్షణీయమైన స్త్రీని వర్ణిస్తాయి. సరదాగా, ఆకర్షణీయంగా సాగే విధంగా ఈ సాంగ్ ఉంది.  ఈ పాటలో పూజా హెగ్డే తన గ్లామర్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో వైపు రజనీకాంత్‌తో కలిసి ఆమె తెరపై కనిపించడం అభిమానులకు కనుల పండుగలా ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట, తనదైన మార్క్ బీట్స్‌తో ఆకట్టుకుంటోంది. సాండీ కొరియోగ్రఫీ, సుభాషిణి, అసల్ కోలార్ గానం ఈ పాటకు మరింత జోష్‌ను అందించాయి.

 

'కూలీ'పై పెరుగుతున్న అంచనాలు
'కూలీ' చిత్రం ఆగస్టు 14 నుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల IMDb విడుదల చేసిన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో 'కూలీ' అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. 'వార్ 2', 'ది రాజాసాబ్' వంటి భారీ చిత్రాలను అధిగమించి 'కూలీ' అగ్రస్థానంలో నిలవడం రజనీకాంత్ స్టార్‌డమ్‌కు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలవబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు, 38 సంవత్సరాల తర్వాత ఆయనతో మళ్లీ తెర పంచుకుంటున్న సత్యరాజ్ నటిస్తుండడం కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. వీరిద్దరి కాంబినేషన్ 'బాషా' వంటి క్లాసిక్ చిత్రాలను గుర్తు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా, నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ వంటి బహుభాషా నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ పూజా హెగ్డే , అమీర్ ఖాన్ అతిథి పాత్రల్లో అలరించబోతుండటంతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ స్టార్ కాస్ట్ సినిమాకి ఒక పాన్-ఇండియా లుక్ తీసుకొచ్చింది.  ఆగస్టు 14న సినిమా విడుదలయ్యాక, రజనీకాంత్ మ్యాజిక్ తెరపై ఎలా ఉండబోతుందో చూడాలి..