
- ఆర్మీ చరిత్ర సృష్టించింది: రాజ్‌నాథ్
- సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్
- భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు.. టెర్రరిస్టులే
- దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని వెల్లడి
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్సిందూర్’తో అమాయకుల ప్రాణాలు తీసినోళ్లనే మట్టుబెట్టామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పామని అన్నారు. మన సైనికులు రాత్రి చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ ఓ) కు చెందిన 50 ప్రాజెక్టులను రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ‘‘ఈ ఆపరేషన్ మన సైనిక కచ్చితత్వాన్ని మాత్రమే కాకుండా.. మన నైతికతను ప్రతిబింబిస్తున్నది. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు. మన అమాయకులకు హాని చేసిన వారిపైనే మనం దాడి చేశాం”అని పేర్కొన్నారు.
మన సైన్యం సత్తా చాటింది
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన సైన్యం కచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వంతో వ్యవహరించిందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘మన ఆర్మీ జవాన్లు రాత్రి అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో సాధారణ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని చెప్పారు. భారత్ లక్ష్యం పాక్ కాదని, టెర్రరిస్టులే అని స్పష్టం చేశారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల విషయంలో పూర్తి అలర్ట్‌గా ఉన్నామని వెల్లడించారు.