ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే

ఫస్ట్ ఫేజ్ పోలింగ్..  ఓటేసిన ప్రముఖులు వీళ్లే

దేశంలో ఓట్ల పండుగ షురూ అయింది. ఏడు విడతల్లో జరిగే లోక్ సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. లోక్ సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. కరూర్ లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు బీజేపీ చీఫ్ అన్నామలై. కోయంబత్తూరు మోడల్ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు . 

శివగంగలో ఓటేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.  తమిళనాడులోని మొత్తం 39 సీట్లను ఇండియా కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. కోయంబత్తూర్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓటు వేశారు. 

ప్రముఖ హీరో రజనీ కాంత్ చెన్నైలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన.. లైన్ లో నిలబడి ఓటేశారు. ఓటేసిన తర్వాత వేలు చూపిస్తూ.. అందరూ ఓటేయాలని కోరారు. తిరువాన్మియూర్‌లో నటుడు అజిత్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని కోయంబేడులోని పోలింగ్‌ బూత్‌ లో ఓటువేశారు కమల్ హాసన్.

మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్ తూర్పులోని లువాంగ్‌ సంగ్‌బామ్ మమంగ్ లైకైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఖతిమాలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటు వేశారు.