ప్రభుత్వ పథకాలు పేదలందరికీ అందించే వరకు జీతం తీసుకోను! : కలెక్టర్ అరుణ్ కుమార్

ప్రభుత్వ పథకాలు పేదలందరికీ అందించే వరకు జీతం తీసుకోను! : కలెక్టర్ అరుణ్ కుమార్
  •     రాజస్థాన్​లోని రాజ్‌సమంద్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం

జైపూర్: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని పేదలందరినీ మూడు ముఖ్యమైన ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో నమోదు చేసే వరకు తాను జీతం తీసుకోనని ఆ జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ హసిజా ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పేదలకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉచితంగా గోధుమలు అందిస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల కోసం పాలన్హార్ యోజన పథకం కింద సాయం చేస్తోంది. వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు సామాజిక భద్రతా పెన్షన్ ను అందిస్తున్నది. 

అయితే, రాజ్‌సమంద్ జిల్లాలో సుమారు 30 వేల మంది పేద  ప్రజలు ఉన్నారని, వారిలో చాలా మంది ఈ స్కీమ్​లను పొందలేకపోతున్నారని కలెక్టర్ అరుణ్ కుమార్ గుర్తించారు. వెంటనే వారికి ఈ పథకాలు అందించాలని నిర్ణయించుకొని , వారి పేర్లు నమోదు చేయడం ప్రారంభించారు. కలెక్టర్​ తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం 48 గంటల్లోనే రిజల్ట్స్ ​కనిపించాయి. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ‘‘జీతం 10 రోజులు ఆలస్యమైతేనే ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడతారు. అలాంటిది సంక్షేమ పథకాలు అందకుంటే పేదలు ఇంకెంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు. అలాగే, ‘‘ఈ ప్రతిజ్ఞ నా ఒక్కడిదే. నేను దీనిని ఎవరిపైనా రుద్దాలనుకోవడం లేదు. అర్హులందరి పేర్లు పథకాలలో నమోదు చేసే వరకు నేను నా జనవరి జీతం తీసుకోను’’ అని కలెక్టర్ అన్నారు. ఈ నెల 31 వరకు ఈ పని పూర్తవుతుందని అధికారులు తనకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.