రాజ్యసభలో రగడ... సభ మధ్యాహ్నానికి వాయిదా

రాజ్యసభలో రగడ... సభ మధ్యాహ్నానికి వాయిదా

పార్లమెంట్ ప్రతిపక్షాల నిరసనలతో అట్టుడికింది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ఎల్‌పిజి ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిఎంసి సహా విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత లంచ్‌ వరకు రాజ్యసభ వాయిదా పడింది. కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. వామపక్షాలకు చెందిన ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా లేచి నిలబడ్డారు. దీంతో సభను మొదటి సారి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ సమావేశమైనప్పుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని ప్రతిపక్షాలను కోరారు. అయినా కూడా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో... సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. 

మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు ముందు కూడా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం లీటరుకు 80 పైసలు పెంచగా, దేశీయ వంట గ్యాస్ ఎల్‌పిజి ధరలు సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెంచింది కేంద్రం.