
కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ‘ఎవరో రైతు చనిపోయాడని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. రైతు చనిపోతే కేటీఆర్ ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడుతారా..? రైతులంటే ఆయనకు చిన్నచూపా..?’అని ప్రశ్నించారు. దొడ్డి దారిన కాకుండా.. గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్.. ఇప్పుడు రైతుల ఉసురు పోసుకున్నారని ఆరోపించారు.
రాబోయే మూడు నెలల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని బీజేపీ మరింత ఉధృతం చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. పల్లె పల్లెకు బీజేపీ పేరుతో రైతు సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’నినాదంతో మిషన్ 90 లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు. ఏప్రిల్ లో కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛార్జ్ షీట్ విడుదల చేస్తారని తెలిపారు.
ప్రజా సమస్యలపై సంక్రాంతి తర్వాత మేధావుల సమ్మేళనం నిర్వహిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లా స్థాయిలో భారీ సభలు, 10 వేల గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మేధావులు, కవులు, కళాకారులు స్పందించాలని పిలుపునిచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం బడా బాబులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రం మాత్రమే రైతులకు న్యాయం చేస్తోందని చెప్పారు.