
రాజన్న సిరిసిల్ల జిల్లా: రక్షా బంధన్.. సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్పేందుకు అత్యంత ఘనంగా జరుపుకునే పవిత్రమైన పండుగ. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అండగా ఉంటాడని ఆకాంక్షిస్తూ.. తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరి తమ సోదరులకు రాఖీ కడతారు. అలాంటిది.. తంగళపల్లి మండలం బద్దెనపల్లి గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో రాఖీ కట్టించుకోవడానికి తమ అన్నలు, తమ్ము్ళ్లు స్కూల్ వద్దకు రావడంతో సందడి కనిపించింది. స్కూల్ ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వకపోవడంతో లోపల నుంచి వారి అన్న, తమ్ముళ్లకు చిన్నపాటి కిటికీ జాలి నుంచి రాఖీ అక్కచెల్లెమ్మలు రాఖీ కట్టారు.
రాఖీ పౌర్ణమి కావడంతో ఎలాగైనా అక్క, చెల్లితో రాఖీ కట్టించికోవాలన్న గంపెడాశతో స్కూల్ వద్ద ఇవాళ ఉదయం నుంచి ఆ సోదరులు బారులు తీరారు. విద్యార్థినుల తల్లిదండ్రులను అనుమతించకపోవడంతో ఇలా రాఖీ కట్టించుకొని తమ అన్న, తమ్ముళ్లతో అక్కచెల్లెమ్మలు ఆనందాన్ని పంచుకున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ సంవత్సరకాలం ఒక్కసారిగా వచ్చే పండగ రాఖీ పౌర్ణమి అని కనీసం ఒక గంట కూడా సమయం కేటాయించలేదని, కనీసం ప్రిన్సిపాల్కు కాల్ చేస్తే కనీసం స్పందించలేదని తెలిపారు.