Rakul Preet Singh Brother: పోలీసుల అదుపులో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్..

Rakul Preet Singh Brother: పోలీసుల అదుపులో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్..

హైదరాబాద్: భాగ్య నగరంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 200 గ్రాముల కొకైన్ పట్టుబడటం గమనార్హం. ఈ వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమన్ ప్రీత్ సింగ్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ముంబై, గోవా నుంచి భారీగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో కొందరు సినీ, వ్యాపార ప్రముఖులను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.

 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కు సంబంధించి బయటపడుతున్న ప్రతీ ఉదంతంలో సినీ రంగానికి చెందిన వారి పేర్లు బయటపడుతుండటంతో టాలీవుడ్ కలవరపాటుకు గురైన పరిస్థితి ఉంది. నిందితుల వివరాలను పోలీసులు బయటపెట్టారు. ఒనౌహా బ్లెస్సింగ్( వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతం, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు డ్రగ్ సప్లయర్స్ పరారీలో ఉన్నారు. ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్స్ నుంచి 199 గ్రాముల కొకైన్, 2 పాస్ పోర్ట్ లు, 10 మొబైల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు.