ఆటో బంధు ప్రకటించాలి : నందకిషోర్   

ఆటో బంధు ప్రకటించాలి : నందకిషోర్   
  •     బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్   
  •     శంషాబాద్​లో ఆటోడ్రైవర్ల ర్యాలీ  

శంషాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే మహాలక్ష్మి స్కీమ్​తో  ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని బీఎంఎస్ రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు. స్కీమ్ పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ.. మంగళవారం శంషాబాద్​లో ఆటో డ్రైవర్లు  భారీ ర్యాలీ తీయగా.. బీఎంఎస్ మద్దతు ప్రకటించింది.  అనంతరం బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీమ్​తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రోజుకు రూ. 1000 ఇచ్చి ప్రభుత్వ ఆఫీసుల్లో క్యాబ్​ల మాదిరిగా ఆటోలను కూడా వినియోగించుకోవాలని కోరారు. లేదంటే రైతు బంధు తరహాలో ఆటో బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించకుంటే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. బీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఎండీ సయ్యద్, నేతలు రవి, శ్రీను, జగదీశ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.