రాముడు అందరివాడు.. అలాగే ఖురాన్ కూడా అందరిదీ

రాముడు అందరివాడు.. అలాగే ఖురాన్ కూడా అందరిదీ

న్యూఢిల్లీ: రాముడు అందరివాడని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రైతులను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాజ్యసభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ.. సాగు చట్టాల విషయంలో చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. మొత్తం ప్రపంచం ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా భారత్ గురించి ప్రశంసిస్తుందని.. కానీ ఆ ప్రకాశాన్ని, ఆ పేరును మన దేశం కోల్పోతోందన్నారు. రైతులు చట్టాలను తిరస్కరిస్తున్నప్పుడు వారితో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ‘ఇది మన దేశం. మనందరం పరస్పరం ఒకర్నొకరం గౌరవించుకోవాలి. రాముడు అందరివాడు. ఖురాన్ కూడా అందరిదీ. మేం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వానికి అవసరమైన సమయంలో సరైన సూచనలు చేస్తాం’ అని ఫరూక్ చెప్పారు.