మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన ' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.
పెద్ది రిలీజ్ వాయిదా?
రామ్ చరణ్ సరసన 'జాన్వీ కపూర్' హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ గడువుకు సినిమా రావడం కష్టమేనని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కారణం ఇదేనా?
సినిమా వాయిదా పడటానికి ప్రధానంగా షూటింగ్ పెండింగ్‌లో ఉండటమే కారణమని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఇంకా సుమారు ఒక నెల రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, కొన్ని కీలక సీన్లను ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. ఫస్టాఫ్ రీ-రికార్డింగ్ పనులు పూర్తయినప్పటికీ, సెకండాఫ్ పనులు, భారీ స్థాయిలో ఉండే గ్రాఫిక్స్ (VFX) పనులకు మరికొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది పాన్ ఇండియా సినిమా అంటే కనీసం రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఇప్పటివరకు కేవలం 'చికిరి చికిరి' అనే సాంగ్ మాత్రమే విడుదలైంది. టీజర్, ట్రైలర్ , మిగిలిన పాటలు విడుదల చేయాల్సి ఉంది.
సమ్మర్ బరిలో 'పెద్ది'?
మార్చి నెలాఖరులో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని, మేకర్స్ ఇప్పుడు సమ్మర్ కానుకగా మే లేదా జూన్ నెలల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. వేసవి సెలవులు సినిమా వసూళ్లకు కలిసొస్తాయని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం దొరుకుతుందని టీమ్ భావిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా చరణ్ ఈ సినిమా కోసం చేసిన ఫిజికల్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ఈ వాయిదా వార్తలపై నిర్మాత పెద్ది వెంకట సతీష్ కిబాదు లేదా దర్శకుడు బుచ్చిబాబు నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే మార్చిలోనే వచ్చే అవకాశం ఉంది, లేదంటే సమ్మర్ రేసులోకి వెళ్లడం ఖాయం. రామ్ చరణ్ కెరీర్‌లో 'గేమ్ చేంజర్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ భావిస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
