పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతి రావు పై ఓ సినిమా తెరకెక్కుతుంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృతలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్ ది షెడ్యూల్డ్ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది మరో సామాజిక వర్గం. ఆమె తండ్రి మారుతి రావు. అయితే తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి మారుతి రావు, బాబాయి శ్రవణ్ కలిసి కిరాయి హంతకులతో ప్రణయ్ ను పట్టపగలే హత్య చేయించారు. ఈ హత్య తో అప్పట్లో మిర్యాలగూడ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో ఉండగా ఏ1 ముద్దాయి అమృత తండ్రి మారుతి రావు హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
తాజాగా ఈ అమృత, మారుతి రావుల కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. వాస్తవాలకు దగ్గరగా.. అభూత కల్పనలకు దూరంగా ఉండే సంచలనాల దర్శకుడు వర్మ ఈ సినిమాకు మర్డర్ అని పేరు పెట్టారు. కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్ లైన్ ను యాడ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో నిర్మాతలుగా నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి, ఆనంద్ చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ యాక్ట్ చేస్తున్నారు.
కాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషాద గాథకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్‌ర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ తండ్రి తన కూతురిపై ఉన్న అమిత ప్రేమ ఎంతటి ప్రమాదం.. అమృత, మారుతి రావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంగా హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్ డే రోజున.. ఈ విషాద తండ్రి కథకు సంబంధించిన చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేస్తున్నాను అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ర్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
