కరెక్ట్​ టైంలోనే లాక్​డౌన్..అందుకే కరోనా కట్టడి

కరెక్ట్​ టైంలోనే లాక్​డౌన్..అందుకే కరోనా కట్టడి

హైదరాబాద్‌‌, వెలుగుమన దేశంలో కరెక్ట్​ టైంలోనే లాక్​డౌన్​ విధించామని, అందుకే కరోనాను కట్టడి చేయగలిగామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌‌ అన్నారు. కరోనా విస్తరిస్తున్న వేళ తబ్లిగి జమాత్‌‌ వ్యవహరించిన తీరు సరిగా లేదని, ఆ సంస్థపై చేసే విమర్శలు ఒక మతం చేసేవి ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను త్వరలోనే అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా కొంచెం విజ్ఞతతో వ్యవహరించి ఉంటే ప్రపంచం ఈ రోజు కరోనాతో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది కాదన్నారు. డబ్ల్యూహెచ్‌‌వో కూడా కరోనాపై ప్రపంచాన్ని సరైన టైంలో అలర్ట్‌‌ చేయలేక పోయిందని చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీ నుంచి ‘వీ6 వెలుగు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..

మనం సేఫ్​గా ఉన్నం

వేరే దేశాలతో పోలిస్తే మనం చాలా సేఫ్​గా ఉన్నామని రాం మాధవ్​ చెప్పారు. ప్రధాని మోడీ చేపట్టిన చర్యలే దీనికి కారణమన్నారు. ‘‘సరైన టైంలోనే లాక్‌‌డౌన్‌‌ విధించినం. మన దగ్గర తక్కువ కేసులు ఉన్నాయి. అమెరికాలో పది లక్షలకుపైగా కేసులున్నాయి. మిగతా దేశాల్లోనూ లక్షలాది మందికి వైరస్‌‌ వచ్చింది. మనం ఫిబ్రవరిలోనే చైనా నుంచి ట్రావెల్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ పెట్టాం. మార్చి ఫస్ట్‌‌ వీక్‌‌లో మిగతా దేశాల నుంచి వచ్చే వాళ్లకు స్క్రీనింగ్‌‌ మొదలు పెట్టాం. కాబట్టే వైరస్‌‌ను నియంత్రించగలిగాం. దేశంలో 300 జిల్లాలు గ్రీన్‌‌జోన్‌‌లో, 200 జిల్లాలు ఆరెంజ్‌‌ జోన్‌‌లో, వందలోపు జిల్లాలే రెడ్‌‌ జోన్‌‌లో ఉన్నాయి. ఇది పెద్ద అచీవ్‌‌మెంట్‌‌..”అని తెలిపారు. కేంద్రం సైంటిఫిక్‌‌గా అన్ని చర్యలు చేపట్టిందని, అవసరమైన అందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్పారు. రోజూ 40, 50 వేల టెస్టులు చేస్తున్నామని.. కాంగ్రెస్​ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

వైరస్​ కట్టడి కోసమే కఠిన నిర్ణయాలు

వైరస్​ కట్టడి కోసమే ప్రధాని మోడీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని రాం మాధవ్​ తెలిపారు. అప్పటికప్పుడు లాక్‌‌ డౌన్‌‌ ప్రకటించకుంటే వైరస్‌‌ వ్యాప్తి పెరిగేదని, దీనిపై ప్రధాని మోడీ చేతులు జోడించి అందరినీ క్షమాపణ అడిగారని వివరించారు. అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయని తెలిపారు. వలస కార్మికులను ఆదుకొనేందుకు తగిన చర్యలు చేపట్టామని.. బీజేపీ రోజుకు 7 కోట్ల మందికి, ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ 3 కోట్ల మందికి భోజనాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. గరీబ్​ కల్యాణ్​ యోజన ప్యాకేజీ పేదలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. 40 కోట్ల మందికి ఉచిత రేషన్‌‌ ఇస్తున్నామని, 30 కోట్ల మంది ఎకౌంట్లలో 500 చొప్పున వేస్తున్నామని, 6 కోట్ల మందికి 3 నెలలు ఫ్రీగా సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు.

ఎకానమీని పునరుద్ధరిస్తం

కరోనా ఎఫెక్ట్​తో జీడీపీ మూడు శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్​ అంచనా వేసిందని.. స్మాల్, మీడియం ఇండస్ట్రీల్లో ఉద్యోగాలపై ఎఫెక్ట్​ పడుతుందని రాం మాధవ్​ చెప్పారు. దీనిపై రాద్ధాంతం చేయడం సరికాదని, సంపన్న దేశాలు కూడా కరోనాతో అతలాకుతలం అవుతున్నాయని పేర్కొన్నారు. మనం ఎక్కువ నష్టపోకుండా జాగ్రత్తపడ్డామని, ఎకానమీని త్వరలోనే పునరుద్ధరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అప్పులు తీసుకునే పరిమితిని పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను కేంద్రం సీరియస్‌‌గా పరిశీలిస్తోందని, అవసరమైన సాయం అందిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కువ ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలబడేందుకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. త్వరలోనే కేంద్రం ఇంకో ప్యాకేజీ అనౌన్స్‌‌ చేయబోతోందని.. ఉద్యోగాలు పోయిన వారికి కొత్త ప్యాకేజీ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తాయని తెలిపారు.