అయోధ్యకు 54 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు....

అయోధ్యకు 54 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు....

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా  ప్రముఖులకు ట్రస్టు ఆహ్వానాలు పలుకుతున్నది. దేశానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు 54 దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు సైతం రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్‌తో సహా అనేక యూరోపియన్, ఆఫ్రికన్, బౌద్ధ సంప్రదాయ దేశాలకు  ఆహ్వానాలు పంపింది.

అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘ్‌ పరివార్‌, వీహెచ్‌పీ అంతర్జాతీయ శాఖల ప్రముఖులు సైతం రానున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్‌ల సమన్వయంతో జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో రికార్డు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీపోత్సవ్ తరహాలో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విదేశీ అతిథులను ఆహ్వానించారు. వీటిలో కొన్ని దేశాల దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. బాలీవుడ్‌తో పాటు .... సౌత్​ ఫిలిం ఇండస్ట్రీకి  చెందిన సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపారు. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీరాముడిపై ఉన్న ప్రత్యేక విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. రజనీకాంత్, చిరంజీవి, ప్రభాస్, ధనుష్, మోహన్ లాల్ తదితర ప్రముఖులు ఆహ్వానాలు అందుకున్నవారిలో ఉన్నారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజున 1.25లక్షల దీపాలను వెలిగించనున్నారు. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా అయోధ్య ధామ్‌లో పండుగ వాతావరణం నెలకొననున్నది. రామభక్తులు తమదైన రీతిలో పండుగను జరుపుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని శ్రీకృష్ణ సేవా సంస్థాన్ బికనీర్ తరఫున సరయూ బ్యాంకు సహస్రధార హారతి ఘాట్‌లో  జనవరి 16న  1.25 లక్షల దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహించి...  హనుమాన్ చాలీసాను సామూహికంగా పఠించారు. 500 సంవత్సరాల తర్వాత జనవరి 22 న, రామ్‌లల్లా దివ్య ఆలయంలో దర్శనం ఇవ్వబోతున్నారన్నారు. ఇది మనందరికీ సంతోషం, గర్వకారణమని శ్రీ కృష్ణ సేవా సంస్థాన్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సోని అన్నారు.

అయోధ్య అంతటా సుగంధ పరిమళాలు..

గుజరాత్‌ నుంచి వచ్చిన 108 అడుగుల అగరుబత్తీ సువాసనలతో అయోధ్య పరిమళించింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ బస్టాండ్‌లో పూజల అనంతరం అగరబత్తులు వెలిగించగా, జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనించాయి. 3,610 కిలోల బరువు, 108 అడుగుల పొడవున్న ఈ అగరబత్తిని 44 రోజుల పాటు వెలుగనుంది. రామజన్మభూమి కాంప్లెక్స్‌కు భారీ అగరుబత్తీలను తరలించడం సాధ్యం కాదని వీహెచ్‌పీ ప్రాంతీయ మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు. ఈ పరిస్థితుల్లో అయోధ్య ధామ్ బస్టాండ్ కాంప్లెక్స్ లోపలనే భారీ అగర్‌బత్తీని వెలిగించినట్లు తెలిపారు

దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలతో పాటు రామ్ కీ పైడి, శ్రీ రామ్ అయోధ్య ఆయే హై అనే శీర్షికతో ప్రత్యేక న్యూస్ బులెటిన్, రోజువారీ అయోధ్య రౌండ్-అప్, అతిథి చర్చలు, ప్రత్యేక కథనాలు మరియు వోక్స్-పాప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. అనూప్ జలోటా వంటి దిగ్గజ భజన కళాకారులు, గాయకులు షాన్ మరియు మరికొందరు వారం పాటు జరిగే పవిత్రోత్సవంలో అనేక దశలలో తమ గాత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. కథక్, ఒడిస్సీ, కూచిపూడి నృత్య రూపాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పటికే రామ్ కీ పైడి, ధరమ్ పాత్, తులసి ఉద్యాన్, సర్క్యూట్ హౌస్, సాకేత్ కాలేజ్ మొదలైన ప్రదేశాలలో ప్రారంభమయ్యాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకుంటున్నారు.

కొత్త అయోధ్య  సాంస్కృతిక ఇతివృత్తాన్ని...  ఈ కార్యక్రమాలు పరిచయం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త దేవకీనందన్ ఠాకూర్ రామ్ కథా పార్క్‌లో జనవరి 23 వరకు  రామ్ కథను వివరిస్తారు.  ప్రతిరోజూ అయోధ్యకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి రాబోయే కొద్ది నెలల పాటు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారులు తెలిపారు.