ఇయ్యాల అయోధ్యకు రాముడి ప్రతిమ

ఇయ్యాల అయోధ్యకు రాముడి ప్రతిమ

అయోధ్య/మైసూరు: శుభ సమయం రానే వచ్చింది.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆగమనానికి వేళయింది. అయోధ్యలో రామ్‌‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు క్రతువు మొదలైంది. మంగళవారం మొదలైన యజ్ఞ యాగాలు ఈ నెల 21 దాకా కొనసాగనున్నాయి. ఈ నెల 22న ముఖ్యమైన క్రతువులు పూర్తయిన తర్వాత.. తన జన్మభూమిలో రామయ్య కొలువుదీరనున్నాడు. ఈ వేడుకలను చూడటానికి 150 దేశాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. 23 నుంచి భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించింది.

వారం రోజులు పూజలిలా..

  •     జనవరి 16: శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధి.. ‘ప్రాయశ్చిత్త’ కార్యక్రమం, కర్మకూటి పూజ నిర్వహించారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరిపారు.
  •     జనవరి 17: ‘పరిసర్ ప్రవేశ్’ పూర్తవుతుంది. అంటే శ్రీరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ నది జలాలను తీసుకొని భక్తులు 
  • రామ జన్మభూమి ఆలయానికి చేరతారు.
  •     జనవరి 18: గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మిణ్ వరణ్, వాస్తు పూజలతో క్రతువులు ప్రారంభమవుతాయి.
  •     జనవరి 19: పవిత్ర అగ్నిని వెలిగించి.. యజ్ఞం ప్రారంభిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు.
  •     జనవరి 20: ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుద్ధి చేస్తారు. తర్వాత ‘వాస్తు శాంతి’, 
  • ‘అన్నదివస్‌‌’ ఆచారాలను నిర్వహిస్తారు.
  •     జనవరి 21: శ్రీరాముడి విగ్రహానికి 125 
  • కలశాలతో జలాభిషేకం చేస్తారు.
  •     జనవరి 22:- మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది.
     

సంప్రదాయ వాయిద్యాలతో వేడుక


దేశవ్యాప్తంగా వివిధ సంప్రదాయ వాయిద్యాలతో అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలను జరుపుకోనున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విద్వాంసులను ఇందుకోసం ఎంపిక చేసినట్లు ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. 22న మధ్యాహ్నం 12.20కి మొదలై ఒంటి గంటకల్లా కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. 8 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
 

శిల్పి ఇంట్లో ఆనందోత్సహాలు..


శ్రీరాముడి విగ్రహాన్ని తయారుచేసే విషయంలో యోగిరాజ్ నిద్రలేని రాత్రులు గడిపారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహం రూపొందించే సమయంలో కంటికి గాయమైందని, ఆపరేషన్ చేసి రాయిని బయటకు తీశారని యోగిరాజ్ భార్య విజేత చెప్పారు. ఆ టైమ్​లో నొప్పిని భరిస్తూనే పని కొనసాగించారని తెలిపారు. తన కొడుకు రూపొందించిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠిస్తారని తెలిసిన తర్వాతతమ కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయని యోగిరాజ్ తల్లి సరస్వతి తెలిపారు.