
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో మార్పులకు సంకేతమా! అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. బాగ్‌పత్‌లోని బరౌలీలోని ఈ యాత్ర సాగుతుండగా అక్కడ బీజేపీకి చెందిన వారు స్వాగతం పలికారని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అలాగే రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఇటీవల రాహుల్ గాంధీని అభినందిస్తూ ఇచ్చిన మద్దతు లేఖ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
‘భారత్ జోడో యాత్రను స్వాగతిస్తూ అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఇటీవల లేఖ రాశారు. వీహెచ్‌పీ నేతలైన చంపత్ రాయ్ వంటి నేతలు రాహుల్ గాంధీని ప్రశంసించారు. దీని తర్వాత ఇవాళ భాగ్‌పత్‌లోని బరౌలీలో బీజేపీ కార్యాలయంలో ఉన్న వారు ఉత్సాహంగా చేతులు ఊపుతూ యాత్రకు స్వాగతం పలికారు’ అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. సీఎం యోగి రాష్ట్రంలో వాతావరణ మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు.