Ayodhya: అయోధ్యలో అద్భుతం..బాలరాముడి నుదుట సూర్యతిలకం

Ayodhya:  అయోధ్యలో అద్భుతం..బాలరాముడి నుదుట సూర్యతిలకం

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో మార్చి 27(శుక్రవారం) శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాణప్రతిష్ఠ తరువాత మూడో శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రామ్​లల్లా నుదుటిపై సూర్య తిలకం అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడేలా పది మంది సైంటిస్టుల బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అడ్వాన్స్ డ్​ సైంటిఫిక్ టెక్నాలజీ సాయంతో స్పెషల్ సెటప్ డిజైన్ చేసింది. మధ్యాహ్నం 12:00 గంటలకు 5.8 సెం.మీ. పొడవులో సూర్య కిరణాలు రామ్​లల్లా నుదుటిపై పడ్డాయి. 

దాదాపు 3.50 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తుల కనువిందు చేసింది. విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు, లెన్స్ ఉపయోగించి థర్డ్ ఫ్లోర్ నుంచి సూర్యకాంతి నేరుగా బాలరాముడి నుదుటిపైకి మళ్లించడం ద్వారా ‘సూర్య తిలకం’ ఘట్టం పూర్తయింది. ఆ తర్వాత నవమి సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌ సభ్యుల కోరిక మేరకు సైంటిస్టుల టీమ్ సూర్య తిలకం ఆవిష్కరింపజేసింది. ప్రతి శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  అయోధ్య చరిత్రలోనే అత్యంత ఘనమైన రామనవమి ఉత్సవం ఇదే అని, ఈ సూర్యతిలకం వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుంది. 

శ్రీ రామ నవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివచ్చారు.  వేలాది మంది సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారు. అయోధ్య పరిసరాలు   జై శ్రీ రామ్ నినాదాలతో మార్మోగాయి. జిల్లా యంత్రాంగం పలు  ప్రదేశాలలో  పోలీసు బలగాలను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది.