- రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ తనిఖీ
రామచంద్రాపురం, వెలుగు: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కార్మిక, ఉపాధి, పరిశ్రల శిక్షణ సెక్రటరీ హరిచందన దాసరితో కలిసి ఈఎస్ఐలో రోగులకు అందుతున్న వైద్యం, హాస్పిటల్స్ లో వైద్య సౌకర్యాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పేషెంట్స్‌తో మాట్లాడి వారికి అందుతున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కార్మికుల వైద్యానికి కాంగ్రెస్ పెద్ద పీట వేసిందన్నారు.
ప్రత్యేక నిధులతో రాష్ట్రంలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ ను క్రమబద్ధీకరిస్తామని, వైద్య సదుపాయాలు పెంచి ఈఎస్ఐలను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. పేషెంట్ఫ్లో పెరిగితే మరికొంత మంది స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు.
రామచంద్రాపురం ఈఎస్ఐకి ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్సీపురం ఈఎస్ఐకి ఐసీయూ మంజూరైందని, పెండింగ్ మెడికల్‌బిల్లులు కూడా క్లియర్ చేశామని వివరించారు. కార్డియాలజీ సెంటర్ ఏర్పాటుకు ప్రపోజల్స్ వచ్చాయని, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యాంటీన్, ల్యాబ్డెవలప్మెంట్కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్ బాబు, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
భీరంగూడ గుట్టపై పూజలు..
ఈఎస్ఐ పరిశీలన అనంతరం మంత్రి వివేక్‌వెంకటస్వామి భార్య సరోజ, కొడుకు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి బీరంగూడ గుట్టపై భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పురోహితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి కాట శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షురాలు కాట సుధతో ఆలయ సౌకర్యాలపై సమీక్షించారు.
