రాళ్లకు జీవం పోస్తూ.. కాలంతో పోటీపడుతున్న రామడుగు శిల్పులు..

రాళ్లకు జీవం పోస్తూ.. కాలంతో పోటీపడుతున్న రామడుగు శిల్పులు..

వనవాస సమయంలో ---- శ్రీరాముడు నడిచిన ప్రాంతంలో పాదముద్రలు.. ఎత్తైన పురాతన కోట.. ఆ పక్కనే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, నాగన్న స్టెప్ వెల్.. లోయర్ మానేర్ డ్యామ్.. ఇవన్నీ చారిత్రక  ప్రాధాన్యాన్ని తెలిపే రామడుగు ప్రత్యేకతలు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామడుగు గ్రామం శిల్పకళాకారుల నిలయం. ఈ గ్రామంలోకి అడుగుపెడుతుండగానే ప్రధానరోడ్డుపై పదిహేనుకు పైగా శిల్పకళా నిలయాలు.. వాటి ముందు రాళ్ల గుట్టలు.. రాళ్లతో శిల్పాలు తయారుచేస్తోన్న శిల్పులు మనకు కనిపిస్తుంటారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన రామడుగు శిల్పులు తరతరాలుగా రాతి శిల్పాలను చెక్కుతూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి కళాకారులు తమ అద్భుత నైపుణ్యంతో తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆలయ విగ్రహాలు, దేవతా మూర్తులు, అలంకరణ శిల్పాలు, స్మారక చిహ్నాల రూపకల్పనలో రామడుగు శిల్పులు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.

మెషిన్​లతో..

వందల సంవత్సరాల చారిత్రక ప్రాభవం ఉన్న రామడుగు శిల్పులు అమృతశిల రాళ్లను ఉలి, సుత్తితో చెక్కి దేవుళ్ల విగ్రహాలకు ప్రాణం పోసేవారు. కానీ ఇప్పుడు శిల్పాలు చెక్కేందుకు వీలుగా కటింగ్, గ్రైండింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉలి, సుత్తిని పక్కన పడేసి హ్యాండ్ టూల్ సాయంతో విగ్రహాలను రూపొందిస్తున్నారు. గతంలో రామడుగు శిల్పకళాకారుల సొసైటీ ఆధ్వర్యంలో 200 మందికి పైగా శిల్పులు పనిచేసేవారు. కానీ రాను రాను శిల్పుల సంఖ్య తగ్గడంతోపాటు ఎవరికి వారు శిల్పకళా మందిరాలను ఏర్పాటు చేసుకుని శిల్పాలు చెక్కుతున్నారు.

శిల్పాలు ఇలా చెక్కుతారు...

ఒక సాధారణ రాతి బండను అందమైన కళాఖండంగా మార్చడం వెనుక ఎన్నో రోజుల శ్రమ, నైపుణ్యం దాగి ఉంటుంది. దేవాలయాల్లో దేవుళ్లు, దేవతా విగ్రహాల సైజును బట్టి క్వారీ నుంచి నల్ల గ్రానైట్ రాళ్లను కొంటారు. ముందుగా శిల్పం రూపురేఖలను రూపొందించి, అనంతరం సాంప్రదాయ పనిముట్లు, ఆధునిక యంత్రాల సాయంతో చెక్కుతారు. ప్రతి శిల్పంలో సౌందర్యం, భావ వ్యక్తీకరణ స్పష్టంగా కనిపించేలా కళాకారులు శ్రద్ధ తీసుకుంటారు. రాయిని హ్యాండ్ కటింగ్, గ్రైండింగ్ మిషన్ల సాయంతో కట్ చేస్తూ విగ్రహాలకు రూపకల్పన చేస్తారు. తర్వాత ఆ విగ్రహాలకు మహిళా శిల్పులు ఫినిషింగ్ చేస్తుంటారు. 

దేవుళ్లు.. దేవతలు..

‘‘వివిధ దేవుళ్లు, దేవతల విగ్రహాల తయారీకి ఆర్డర్లు వస్తున్నాయం’’టారు వెంకటేశ్వర శిల్పకళామందిరం శిల్పి నవీన్ చారి. తెలంగాణలోని ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు అందుకుంటూ ఈ కళను రామడుగు శిల్పులు సజీవంగా ఉంచుతున్నారు. ‘‘అమ్మవారి విగ్రహాలు, దుర్గాదేవి, హనుమంతుడు, రాములవారి, పోచమ్మ విగ్రహాలకు డిమాండ్ పెరిగింద’’ని శిల్పకళా మందిరం ప్రధాన శిల్పి వడ్లూరి నరేంద్ర చారి చెప్పారు. మైసమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, ఆంజనేయస్వామి, బ్రహ్మంగారు, పెద్దమ్మతల్లి, సరస్వతీదేవి, నంది విగ్రహాలను శిల్పులు రూపొందిస్తున్నారు.  

గార్డెన్, ఫాం హౌస్​లలో..

మారుతోన్న కాలాన్ని బట్టి శిల్పులు గార్డెన్, ఫాం హౌస్​లలో రాతి డిజైన్లు రూపొందిస్తున్నారు. రాతి కళకు కొత్త రూపు ఇస్తూ వినూత్న డిజైన్లను తయారుచేస్తున్నారు. ఇంటి అలంకరణలో భాగంగా రాతి దర్వాజలు, తులసికోట, ఏనుగు విగ్రహాలు, గార్డెన్లలో రాతి అరుగులు, కుర్చీలు, డైనింగ్ టేబుళ్లు, సీసీ కెమెరా పిల్లర్లు, ఫౌంటేన్​లు, డ్రాయింగ్ రూంలో పెట్టుకునేందుకు నాట్యం చేసే బొమ్మలు, బుద్ధుడు, ఆవు, దూడ, కృష్ణుడు, రాధాకృష్ణులు వంటివి శిల్పులు తయారుచేస్తున్నారు.

 శిల్పశాస్త్రంతోపాటు వేదాలు అధ్యయనం

శిల్పకళామందిరం ప్రధాన శిల్పాచార్యులు వడ్లూరి నరేంద్రచారి ‘‘వేదాలు అధ్యయనం చేయడం వల్ల పురోహితుడిగా తాను తయారుచేసిన దేవుళ్ల విగ్రహాలను తానే దేవాలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాన’’ని చెప్పారు. ఇప్పటికే తాను 600కు పైగా దేవాలయాలకు విగ్రహాలు తయారు చేసి ఇచ్చానన్నారు. దేవాలయాలకు 50 అడుగుల ఎత్తున్న రాతి ధ్వజస్తంభాలను తయారుచేసేందుకు వీలుగా తాను గ్రానైట్ కటింగ్, ట్రాలీ మూవ్​మెంట్​తో సరికొత్త మెషిన్ తెప్పించి, దాని సాయంతో పెద్ద ఆలయ ధ్వజ స్తంభాలను రాతితో తయారుచేస్తున్నానని వివరించారు. 

విదేశాలకు రామడుగు శిలా విగ్రహాలు

రామడుగు శిల్పులు తయారు చేసిన పలు విగ్రహాలు వివిధ దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి. ఎడ్లబండి, ఖడ్గమృగాలను తయారుచేసి యూకేకు పంపించానని శ్రీరామ శిల్పకళా మందిరం శిల్పాచార్యులు షికల్లా హరిహరాచారి చెప్పారు. గతంలో తాను చెక్కిన విగ్రహాలు అమెరికాలోని దేవాలయాల్లో ప్రతిష్ఠించారని ఆయన తెలిపారు.

అమృతశిల రాళ్ల మైనింగ్​కు బ్రేక్!

రామడుగుకు సమీపంలోని పెగడపల్లి మండలం బావుపేట, వెంగళాయపేట గ్రామాల దగ్గర ఉన్న రాతి గుట్టల నుంచి గతంలో అమృతశిల రాళ్లను తీసుకొచ్చి దాంతో రాతి శిల్పాలను చెక్కేవారు. విగ్రహాల తయారీకి అనుకూలంగా మెత్తగా ఉండటంతో శిల్పుల చేతిలో పడితే చాలు రాయికి వివిధ ఆకారాలు వచ్చేవి. తమ గ్రామంలోని అమృతశిల రాయిని శిల్పాలకు తరలించొద్దని ఆయా గ్రామాల ప్రజలు తీర్మానించడంతో ‘‘రామడుగు శిల్పులు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్​తోపాటు వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి నల్ల గ్రానైట్ రాయిని శిల్పాల తయారీకి కొనాల్సి వస్తోంద’’ని నవీన్ చారి చెప్పారు. రవాణా ఖర్చుల వల్ల నల్ల గ్రానైట్ రాళ్ల ధర పెరగడంతో శిల్పాల తయారీ వ్యయం కూడా పెరుగుతోందని ఆయన వివరించారు.

కళపై మక్కువతో..

శిల్పాలు చెక్కేందుకు కావాల్సిన రాళ్ల కొరత, ప్రభుత్వం నుంచి కొరవడిన సాయంతో రామడుగు శిల్పులు అవస్థలు పడుతున్నారు. తరతరాలుగా రాతి శిల్పాలను చెక్కుతూ జీవనం సాగిస్తున్న ఇక్కడి కళాకారులు తమ అద్భుత నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో 200 మంది ఉన్న శిల్పుల సంఖ్య నేడు 50కి తగ్గింది. యంత్రాలతో తయారయ్యే విగ్రహాలు మార్కెట్‌లోకి రావడం, ముడి రాతి ధరలు పెరగడం, యువత ఇతర రంగాల వైపు మొగ్గు చూపడం వల్ల సంప్రదాయ శిల్పకళపై ప్రభావం పడుతోంది. అయితే కళపై మక్కువతో కొందరు రామడుగు శిల్పులు తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘ముత్తాతల కాలం నాటి నుంచి తాము శిల్పకళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామ’’ని రామడుగుకు చెందిన గాయత్రి శిల్పా కళామందిరం ప్రధాన శిల్పి వడ్లూరి శ్రీనివాసాచారి చెప్పారు. తెలంగాణలో రామడుగు కేంద్రంగా ప్రఖ్యాతి గాంచిన శిల్పకళను మరుగున పడకుండా పరిరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని శిల్పులు కోరుతున్నారు. దాంతో మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఈ ప్రాచీన కళకు మరింత గుర్తింపు లభిస్తుంది అంటున్నారు రామడుగు శిల్పులు. 

కళాకారులకు అవార్డులు

రామడుగు శిల్పి వడ్లూరి నరేంద్రచారి చేసిన దేవతావిగ్రహాలను దేవాలయాల్లో ప్రతిష్ఠించాక శిల్పిని భక్తులు సత్కరించారు. వడ్లూరి అనంతా చారికి ఉత్తమ శిల్పి అవార్డు లభించింది. మరో శిల్పి హరిహరాచారికి బెస్ట్ క్రాఫ్ట్ మెన్ అవార్డు దక్కింది. శిల్పకళ అంతరించి పోకుండా కాపాడేందుకు జాతీయ హాండిక్రాఫ్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తాను 30 మంది యువకులకు మూడు నెలలు శిల్పకళలో శిక్షణ ఇచ్చానని హరిహరాచారి చెప్పారు.