సీతారాముల పూజలందుకొని వెలసిన ‘రామలింగేశ్వరుడు’

సీతారాముల పూజలందుకొని వెలసిన  ‘రామలింగేశ్వరుడు’

మహాశివరాత్రి రోజు యాటల్ని కోసి, మొక్కులు చెల్లిస్తారు రామలింగేశ్వరుడి గుడిలో. ఈ గుడి నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలంలో ఉన్న లొంకలో ఉంది. శివరాత్రి సందర్భంగా ఈ గుడిలో మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. 

ఇక్కడి శివుడికి ‘రామలింగేశ్వరుడు’ అని పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. రాముడు అరణ్యవాసంలో శివరాత్రి రోజున సీతాలక్ష్మణులతో కలిసి లొంకకు వచ్చాడట. శివుడికి పూజ చేయాలని సీత అనుకుంటుంది. కానీ, అక్కడ శివాలయం ఉండదు. సీత  కోరిక మేరకు రాముడు ఇసుకతో శివలింగం చేసి, ప్రతిష్ఠించాడట. ఆ శివలింగానికి రాముడు, సీత, లక్ష్మణుడు వారం రోజులు పూజలు చేశారట. వాళ్ల పూజకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, రాముడిని వరం కోరుకొమ్మని అడిగితే... ‘ఈ ప్రాంతం నిత్యం పూజలు అందుకోవాల’ని కోరుకున్నాడట. అప్పటి నుంచి శివుడు ఇక్కడ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. ఈ ఆలయ ఆవరణలో రాముడి కాలి ముద్రలు కనిపిస్తాయి. 

యాటల్ని కోసి 
శివరాత్రికి ఉపవాసం ఉండి, మాంసాహారం ముట్టరు. కానీ, ఇక్కడ మాత్రం యాటల్ని కోసి మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరతాయో, లేదోనని తెలుసుకునేందుకు అల్గుబండ కూడా ఉంటుంది. 

ఇలా వెళ్లాలి: సిరికొండ నుంచి 8 కిలో మీటర్ల  దూరం. నిజామాబాద్​ నుంచి 64 కిలోమీటర్ల జర్నీ. బస్సు సౌకర్యం ఉంది. 

::: సిరికొండ, కొండూర్​ రమేష్​, వెలుగు