గ్రామ సమస్యల కోసం 360కిలోమీటర్ల పాదయాత్ర 

గ్రామ సమస్యల కోసం 360కిలోమీటర్ల పాదయాత్ర 
  • రామన్నగూడెం నుంచి  ప్రగతి భవన్ వరకు 360 కిలోమీటర్లు పాదయాత్ర
  • గ్రామస్తుల పాదయాత్రను సమన్వయం చేస్తున్న సర్పంచ్ స్వరూప, ఆమె భర్త
  • తెలంగాణ - ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్కు పాదయాత్ర
  • టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ ప్రగతి భవన్ కు పాదయాత్రగా బయలుదేరారు. పంచాయితీ పరిధిలోని భూములకు డిజిటల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని.. అలాగే అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి అప్పగించాలని పాదయాత్ర చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతామన్నారు. 

టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మడకం స్వరూప, భర్త నాగేశ్వరరావు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. టీఆర్ఎస్ జెండాలు, ప్లెక్సీలతో పాదయాత్రగా చేస్తున్నారు. కేసీఆర్ అభిమానులం కాబట్టి పార్టీ జెండాలతో వెళితే సీఎంను కలిసేందుకు సులువు అవుతుందనే.. ఇలా వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న రామన్నగూడెం నుంచి హైదరాబాద్ కు దాదాపు 360 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు చెప్పిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు విఫలం కావడంతో  ఇవాళ అంటే సోమవారం ఉదయం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో కావాల్సిన మౌళిక వసతుల కల్పనపై సీఎం కేసీఆర్ ను కలుస్తామన్నారు.