
ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప నిలిచింది. రెండేళ్లుగా వచ్చినట్టే వచ్చి చేజారిన అవకాశం ఈసారి దక్కింది. మనదేశం తరఫున చారిత్రక వారసత్వ కట్టడంగా రుద్రేశ్వరాలయాన్ని(రామప్పగుడి) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాలను ఎంపిక చేస్తుంది. దీని కోసం ప్రతి దేశం రెండు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. ఒకటి నేచురల్ సైట్, రెండోది చారిత్రక కట్టడం. ఈ ఏడాది భారత్ తరఫున రామప్పగుడిని పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గతంలో సైతం రామప్ప గుడిని భారతదేశం తరఫున ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2017లో గుజరాత్, 2018లో రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో ఉన్న కట్టడాలు భారత్ తరఫున అధికారిక ఎంట్రీలుగా యూనెస్కోకు వెళ్లాయి. ఆ రెండు సందర్భాల్లో రామప్ప రాష్ట్ర సరిహద్దులు దాటినా దేశ సరిహద్దులు దాటలేకపోయింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఏడాది ఎంట్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో కేంద్ర స్థాయిలో రామప్ప ఎంట్రీకి మద్దతు లభించింది. ఫలితంగా భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా యూనెస్కో తలుపులు తట్టనుంది.
ఐకోమాస్ నివేదిక
భారత్ తరఫున అధికార ఎంట్రీగా రామప్ప యూనెస్కో పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో తర్వలో యూనెస్కో ఓ విభాగమైన ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ అన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ) బృంద సభ్యులు ఇక్కడకు రానున్నారు. రామప్ప ఆలయ విశిష్టతలు, చారిత్రక నేపథ్యం , నిర్మాణ పరిరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు వారు పరిశీలిస్తారు. వాటిని ప్రపంచంలో ఉన్న ఇతర నిర్మాణాలు, అక్కడి కాలమాన పరిస్థితులు తదితర అంశాలతో నివేదిక రూపొందిస్తారు. ఐకోమాస్ ప్రతినిధులు ఇచ్చే నివేదిక ఆధారంగా యూనెస్కో గుర్తింపు లభిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు నాలుగైదేళ్లు పడుతుంది. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం , శిల్పాల విశిష్టత వంటి అంశాల్లో రామప్పకు ఎదురులేదు. ఇక ఆలయ పరిరక్షణకు సంబంధించి ఆలయం నుంచి వంద మీటర్ల దూరం వరకు ప్రొహిబిటెడ్ జోన్, అక్కడి నుంచి మరో 200 మీటర్లు రిస్ట్రిక్టెడ్ జోన్ గా ఉండాలి. ప్రస్తుతం రామప్ప చుట్టూ వంద మీటర్ల దూరంలో ఉన్న ఉన్న వాణిజ్య సముదాయాలు తాత్కాలిక నిర్మాణాలు. ఆ తర్వాత రెండు వందల మీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
2012 నుంచి..
కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు సాధించేందుకు 2012 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలిసారిగా 2012 చెన్నైలో జరిగిన సదరన్ రీజియన్ కాన్ఫరెన్సు ఆన్ వరల్డ్ హెరిటేజ్ సదస్సులో కాకతీయుల కట్టడాలైన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్‍లో న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ సైట్ వర్క్ షాప్ లో సానుకూల స్పందన వచ్చింది. ఆ తర్వాత ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటే టీవ్ లిస్ట్ 2016లో కాకతీయ కట్టడాలకు చోటు లభించింది. యునెస్కో నిబంధనల ప్రకారం వరల్డ్ హెరిటే జ్ సైట్స్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల దూరం వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండరాదనే కఠిన నిబంధన దృష్టిలో ఉంచుకుని ఫైనల్ లిస్ట్ నుంచి వేయి స్తంభాల దేవాలయం, ఖిలావరంగల్‍ను తొలగించారు. ఆ తర్వాత 2017, 2018లో భారత్ తరఫున అధికార ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో కేంద్రం ఓసారి గుజరాత్, మరోసారి రాజస్థాన్ లకు అవకాశం కల్పించింది. తెలంగాణ తరఫున ఇప్పటి వరకు వరల్డ్ హెరిటే జ్ సైట్‍గా గుర్తింపు ఉన్న ఒక్క చారిత్రక కట్టడం లేదు. ఈ నేపథ్యం లో తొలిసారి రామప్పకు ఆ అవకాశం వచ్చింది.