మా భూములకు పాసుబుక్కులు ఇవ్వాలి .. తహసీల్దార్‌‌కు వినతిపత్రం అందచేసిన రైతులు

మా భూములకు పాసుబుక్కులు ఇవ్వాలి ..  తహసీల్దార్‌‌కు వినతిపత్రం అందచేసిన రైతులు

రామాయంపేట, వెలుగు: తమ భూములకు పట్టా పాసు బుక్కులు ఇవ్వాలని రైతులు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని 881 సర్వే నంబర్ లో గల భూమిలో  సుమారు 100 మంది రైతులు ఏళ్ల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామన్నారు. 

మాజీ పీఎం మన్మోహన్ సింగ్ కాలంలో వీటికి పట్టా పాసు బుక్కులు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన పాసు బుక్కులు పంపిణీ జరగలేదని, అధికారులను అడిగితే ఆ భూమి ఫారెస్ట్ ఆధీనంలో ఉందని చెప్పారన్నారు. వాటిపై తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని ఈ సమస్యను తీర్చి పట్టా పాస్ బుక్కుల ను  ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నాడని ధర్నా

కౌడిపల్లి:  ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నాడని మండలంలోని వెల్మకన్నె గ్రామస్తులు తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. కౌడిపల్లికి చెందిన మోతీలాల్ వెల్మకన్నె శివారులోని ప్రధాన రహదారి పక్కన భూమిని జేసీబీతో చదును చేస్తుండగా అడ్డుకున్నామన్నారు. ఆక్రమణపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా చూసి వెల్మకన్నెలోని  నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఆంజనేయులు స్పందించి కబ్జాకు గురైన భూమిని పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

 మా భూముల నుంచి కాల్వలు వద్దు

కోహెడ (హుస్నాబాద్) : తమ భూముల నుంచి కాల్వలు తవ్వొద్దని హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ లో  మీర్జాపూర్ రైతులు రాస్తారోకో చేపట్టారు. వారు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్​ కాల్వలు తమ  భూముల నుంచి తీయొద్దన్నారు. తమకు ఉన్న కొద్ది భూములు కాల్వ కింద పోతే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సంపాదించిన భూములను వదులుకోబోమన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలైనా సిద్ధమన్నారు. అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.