భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంబయిలోని ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కార్యాలయాలతో పాటు ఫిల్మ్ సిటీలోని సంస్థ స్టూడియో, నమిత్ మల్హోత్రా నివాసం, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్‌కు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిగినట్లు సమాచారం.
అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ సోదాలు అక్టోబర్ 8 ఉదయం వరకు కొనసాగినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. విదేశీ ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, పన్నులకు సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు పరిశీలిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సోదాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే పరిశీలనలో ఉన్న లావాదేవీలకు సంబంధించిన నిర్దిష్ట మొత్తాలు కూడా వెల్లడికాలేదు.
ఇదిలా ఉంటే.. గత వారం సినీ రంగానికి చెందిన పలువురి కార్యాలయాలు, నివాసాల్లో జరిగిన ఐటీ తనిఖీలకు కొనసాగింపుగానే ఈ సోదాలు జరిగాయనే ప్రచారం కూడా మొదలైంది. అయితే ఆ రెండు దర్యాప్తులకు నేరుగా సంబంధం ఉందనే విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
షేర్లపై ప్రభావం..
నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్‌కు సంబంధించిన ఈ పరిణామం స్టాక్ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. ఐటీ సోదాల వార్తలు వెలువడిన నేపథ్యంలో కంపెనీ షేరు ధర ఒక దశలో సుమారు 8 శాతం వరకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, పోస్ట్ ప్రొడక్షన్, టెక్నాలజీ సేవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ ఫోకస్.. ‘రామాయణ’ నిర్మాణంలోనూ కీలక భాగస్వామిగా ఉంది. సంస్థకు అనుబంధంగా ఉన్న డీఎన్‌ఈజీ (DNEG) అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సంస్థగా పేరొందింది.
Income Tax Department reportedly raids offices of Ramayana producer Namit Malhotra’s Prime Focus in Mumbai Foreign remittances under scrutiny If ITD confirms financial irregularities, tax evasion, or illegal foreign remittances #Ramayana will be postpone https://t.co/36yc9x0odk
— GlobalBeat Reviews (@Sonam_02_) October 8, 2026
భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’
ఇక నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. భారతీయ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక గాథ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుంది. భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా 'రామాయణ' అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం నిర్మాణ సంస్థపై ఐటీ శాఖ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారినప్పటికీ.. ఈ పరిణామానికి ‘రామాయణ’ సినిమా నిర్మాణం లేదా విడుదలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు.
