భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి భద్రాచలం వద్ద గల గోదావరి నదిలో రామయ్య తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమం జరిపించారు. ఆ తర్వాత భద్రుని మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి వేదపారాయణం చేశారు.
సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేదమంత్రోచ్ఛరణ, రామనామస్మరణ మధ్య ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామి వారిని అధిష్ఠింపజేసి నదీ విహారం చేశారు. అనంతరం అశ్వవాహనంపై తీసుకొస్తూ దోపు ఉత్సవం జరిపారు.
