
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దళిత మహిళను పెళ్లి చేసుకుంటే రూ.2.5 లక్షలు ఇస్తామని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ‘మేం ఇద్దరం, మాకు ఇద్దరు’ అంటూ కేంద్ర సర్కార్‌పై రాజ్యసభలో రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రులకు ఇతోధిక సాయం అందిస్తోందంటూ ఆయన ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అథవాలే రాహుల్ మ్యారేజ్ కామెంట్ చేశారు.
‘మేం ఇద్దరం, మాకు ఇద్దరు అనే స్లోగన్ ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం వాడేవారు. ఒకవేళ రాహుల్ గాంధీ దీన్ని ప్రచారం చేయాలనుకుంటే ఆయన తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి. దళిత మహిళను వివాహం చేసుకొని.. కుల వ్యవస్థ లేని సమాజ స్థాపన కోసం కలలుగన్న మహాత్మా గాంధీ స్వప్నాన్ని రాహుల్ నిజం చేయాలి. ఇది యువతకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అథవాలే పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్ దళిత మహిళను పెండ్లి చేసుకుంటే ప్రభుత్వ పథకం (కులాంతర వివాహం) కింద ఆయనకు రెండున్నర లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.