ఆర్య సమాజ్ రక్షణ అందరి బాధ్యత: రాందేవ్​బాబా

ఆర్య సమాజ్ రక్షణ అందరి బాధ్యత:  రాందేవ్​బాబా

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజలకు వేద మార్గాన్ని చూపిన ఆధునిక మహర్షి ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి అని యోగా గురువు రాందేవ్ బాబా​అన్నారు. శనివారం నల్గొండ జిల్లా  రామగిరిలోని ఆర్య సమాజ్ మందిరంలో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి మహాసభలతోపాటు ఆర్య సమాజ్​100 ఏండ్ల వేడుకలు నిర్వహించారు. ఆర్యప్రతినిధి సభ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ప్రాచీన గురుకులాలను మరింత అభివృద్ధి చేయటంతోపాటు  కొత్త గురుకులాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా యువత, విద్యార్థులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలని చెప్పారు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారని గుర్తుచేశారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాందేవ్ బాబా పేర్కొన్నారు. నల్గొండకు రావడం సంతోషంగా ఉందన్నారు.

ఆకట్టుకున్న కార్యక్రమాలు

దయానంద సరస్వతి జయంతి వేడుకల్లో వేద పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యువత కర్రసాము, కత్తిసాముతో పాటు వివిధ విన్యాసాలు చేశారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్ లోని మలక్ పేట్, డెహ్రడూన్ రాష్ట్రాల్లోని గురుకులాల స్టూడెంట్లు యజ్ఞాన్ని నిర్వహించారు.  సనాతన ధర్మాన్ని తెలియజేసే పలు పుస్తకాలను రాందేవ్ ఆవిష్కరించారు. పట్టణంలో పురవీధుల గుండా దయానంద సరస్వతి శోభాయాత్ర నిర్వహించారు. వైదిక గురుకుల సంచాలకులు స్వామి ప్రణయానంద స్వామి, ఢిల్లీ సర్వదేశిక ఆర్య ప్రతినిధి సభ స్వామి ఆర్యవేశ్, ఆర్య సమాజ్ మందిర్ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ రావు, జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.