ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో విబేధాల్లేవు : రామ్మోహన్ గౌడ్

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో విబేధాల్లేవు :  రామ్మోహన్ గౌడ్

ప్రస్తుతానికి తనకు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్మోహన్ గౌడ్.  గతంలో తనకు, సుధీర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం తాను తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. అవగాహన లేని వ్యక్తులు (మధుయాష్కీ గౌడ్) ఇక్కడ పోటీలో ఉన్నారని, వారి మాటలను ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. మోసగాళ్లకు ఎప్పుడు తాను మోసగాడినే అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు మోసం చేసిందనే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు.

కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తి పోటీలో ఉన్నా... తనకు అన్యాయం జరిగిందన్నారు రామ్మోహన్ గౌడ్. తనకు న్యాయం జరగనప్పుడు తాను ఎలా పని చేస్తానని ప్రశ్నించారు. పార్టీలో తనను నమ్ముకుని ఉన్న తన వర్గీయులకు న్యాయం చేయడం కోసం, పార్టీ పెద్దల కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇచ్చిన బలమైన హామీ మేరకే తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాను కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా గతంలో రెండుసార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయానని చెప్పారు.