టెస్టులతోనే ప్రాణాలు కాపాడొచ్చు: యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లెటర్

టెస్టులతోనే ప్రాణాలు కాపాడొచ్చు: యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లెటర్

న్యూఢిల్లీ: టెస్టులతోనే కరోనాను కంట్రోల్ చేయవచ్చని, ఇదే ప్రజల ప్రాణాలను కాపాడుతుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో టెస్టింగ్ ఫెసిలిటీస్ పెంచాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు శుక్రవారం ఆమె లెటర్ రాశారు. కరోనాపై ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టి వారంతా స్వచ్ఛందంగా టెస్టులకు ముందుకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. “కరోనాపై పోరాటంలో మేము మీతో ఉన్నాం. కులం, మతాలతో సంబంధం లేకుండా వైరస్ అందరికీ వ్యాపిస్తుంది. ఈ పోరాటంలో రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెడదాం. ప్రజల్లో భయాన్ని పోగొడదాం” అని ఆమె లెటర్ లో అన్నారు. యుద్ధప్రాతిపదికన ఎక్కువ మందికి టెస్టులు చేయాలని, అప్పుడే ఐసీయూలపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లను పెంచాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయన్నారు. కొందరు తమకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు చెప్పడం లేదని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకునేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని, దీని కోసం ఎన్జీవోలు, ఇతర సంస్థల హెల్ప్ తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేయాలని, పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు.