రాష్ట్రాభివృద్ధిలో ఆర్ అండ్ బీది కీలక పాత్ర : మంత్రి వెంకట్ రెడ్డి

రాష్ట్రాభివృద్ధిలో ఆర్ అండ్ బీది కీలక పాత్ర : మంత్రి వెంకట్ రెడ్డి
  • భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి: మంత్రి వెంకట్ రెడ్డి
  • గ్లోబల్ సమిట్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశం
  • ఆర్ అండ్ బీ శాఖపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిలో ఆర్ అండ్ బీ శాఖది కీలక పాత్ర అని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భవిష్యత్ అవసరాలకు, విజన్ 2047 అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌‌‌‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ‘విజన్ 2047’పై మంత్రి వెంకట్ రెడ్డి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భవిష్యత్ అవసరాలకుగాను ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రాజెక్టులపై స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 

హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి ఎయిర్​పోర్టులు, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, టిమ్స్, నిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు కొత్త భవన నిర్మాణం, జిల్లా కోర్టుల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. 

అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. గ్లోబల్ సమిట్ ను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, అధికారులు అందుకు తగ్గట్టుగా శాఖాపరమైన విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే గ్లోబల్ సమిట్​లో ఆర్ అండ్ బీ శాఖ విజన్ డాక్యుమెంట్ వీడియో ప్రదర్శనను సిద్ధం చేయాలని ఆదేశించారు.