హడలెత్తిస్తున్నరంగాపూర్ విలేజ్..

హడలెత్తిస్తున్నరంగాపూర్ విలేజ్..

షాద్ నగర్, వెలుగు: రెండు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామంలో వరుస మరణాలతో జనాలు భయపడిపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నెల రోజుల్లో 11 మంది వేర్వేరు కారణాల చేత మృత్యు ఒడికి చేరారు. అసలు తమ ఊరికి ఏమైందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఊరు విడిచి వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రాణాలతో ఉంటే ఏ పని చేసుకొనైనా బతకొచ్చని చెప్పుకుంటున్నారు. ఊళ్లోనే ఉంటే మేము కూడా చస్తామేమోనని భయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని రంగపూర్ గ్రామంలోని పరిస్థితి ఇది.

అలా మొదలైంది..

జూన్ 13వ తేదీన గ్రామానికి చెందిన శిగ అంజమ్మ(60) హాస్పిటల్​కు వెళ్లింది. కాలినడకన తిరిగి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆ తర్వాత 29వ తేదీన రంగాపూర్ కారోబార్ తల్లి లలిత(50), కూతురు శ్రీసాయిఅఖిల(3) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే గ్రామానికి చెందిన జింకల సత్తయ్య (30) కొత్తూరు నేషనల్​హైవేపై రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

సత్తయ్యకు దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చేలోపే గ్రామస్థుడు పిచ్చకుంట్ల రంగయ్య(60) మృతి చెందాడు. అక్కడ నుంచి గ్రామస్థులకు భయం పట్టుకుంది. వేర్వేరు కారణాలతో చనిపోతుండటంతో గ్రామస్థులంతా సమావేశమయ్యారు. కొందరు రహస్య ప్రదేశాలకు వెళ్లి తమ గ్రామానికి ఏ దుష్టశక్తి దాపురించిందోనని కనుక్కునే ప్రయత్నం చేశారని విశ్వసనీయ సమాచారం. గ్రామపెద్దలు మాత్రం 40 సంవత్సరాలుగా గ్రామ దేవత(మైసమ్మ తల్లి)కు పూజలు  చేయకపోవడమే కారణం అంటున్నారు.

ఏది ఏమైనా రంగాపూర్ గ్రామంలో వేర్వేరు కారణాలతో ఇప్పటివరకు 11 మంది చనిపోవడంతో గ్రామస్థులు భయపడిపోతున్నారు. సర్పంచ్ రమేష్ ను వివరణ కోరగా రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో గ్రామస్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రజల్లోని అపోహలు తొలగించి ప్రభుత్వం అవగాహన కల్పిస్తే మంచిది.