
- సాయి సూర్య డెవలపర్స్ప్రచారకర్తగా ఉన్న హీరో
- కొనుగోలు చేసిన డాక్టర్, మరొకరు
- వెంచర్స్‌కు అనుమతి లేదని తేలడంతో కేసు
- మహేశ్‌బాబును నమ్మి మోసపోయామని కంప్లయింట్
ఎల్బీనగర్, వెలుగు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త)గా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేశ్ బాబును ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇదివరకే ఇద్దరు ప్రతివాదులు ఉండగా, మహేశ్‌బాబును తాజాగా మూడో ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఆగస్టు 7వ తేదీన కమిషన్ఎదుట హాజరుకావాలని రంగారెడ్డి వినియోగదారుల కమిషన్నోటీసులు జారీ చేసింది.
నగరంలోని సాయి సూర్య డెవలపర్స్ బాలాపూర్ లో లేఅవుట్ వేయడంతో ఓ మహిళా డాక్టర్ తో పాటు మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే, ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్ చంద్ర గుప్తా రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారు.
దీంతో బాధితులు తాము మహేశ్‌బాబు ప్రకటన చూసి నమ్మి కొన్నామని, ఆయన కూడా దీనికి బాధ్యుడవుతాడని, సంస్థతోపాటు హీరోను కూడా ప్రతివాదులుగా పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆగస్టు 7న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. గతంలో ఇదే సంస్థ విషయంలో మహేష్ బాబును ఈడీ విచారించిన విషయం తెలిసిందే.