- ఫోర్జరీ చేసి రూ.33 లక్షలు మాయం చేశాడని ఆఫీసర్ఫిర్యాదు
- నలుగురు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లపైనా కేసు
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి కలెక్టరేట్లోని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో పని చేస్తూ ఈ నెల 1న ఆత్మహత్య చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వడ్త్యా శ్రీధర్ బాబు కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చెక్కులపై తన సంతకాలు ఫోర్జరీ చేసి రూ.33 లక్షలు మాయం చేశాడని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ నెల 10న కంప్లైంట్చేయడం చర్చనీయాంశమైంది. పైగా ఇందులో ముగ్గురు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ల పాత్ర ఉందంటూ, వారిపైనా కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భార్య ఏమంటుందంటే..
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసే శ్రీధర్ బాబు ఈ నెల 1న తుర్కయాంజాల్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన భర్తను జూనియర్ అసిస్టెంట్ కమ్ లోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు ఫోన్ చేసి వేధించడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి భార్య సరోజ ఆదిభట్ల పీఎస్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. అయితే, 8 రోజుల తర్వాత శ్రీనివాస్ నాయుడును అధికారులు సస్పెండ్ చేశారు.
శ్రీధర్‌బాబు ఫోర్జరీ చేశాడని కంప్లైంట్..
మళ్లీ ఈనెల 10న జిల్లా గిరిజనాభివృద్ధి ఆఫీసర్ రామేశ్వరి చెక్కులపై తన సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు మాయం చేశారని ఆదిభట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. శంషాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ(ట్రైకార్) అకౌంట్ ఉందని, పదేండ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉండడంతో ఆరు నెలల కింద యాక్టివేట్ చేయాలని కోరారు.
యాక్టివేట్ చేసిన తర్వాత చెక్ బుక్ వచ్చింది. దానిని శ్రీధర్‌బాబు రిసీవ్ చేసుకొని డిసెంబర్ నుంచి మే 20 వరకు ఇతర జిల్లాల్లోని బ్యాంకుల బ్రాంచుల నుంచి రూ.33 లక్షలు బదిలీ చేసుకున్నాడని తెలిసింది. దీంతో కలెక్టర్‌కు చెప్పగా, విచారణకు ఆదేశించారు.
అందులో అదిలాబాద్ జిల్లాలోని హస్నాపూర్ టీజీబీ నుంచి రూ. 20.45 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని టీజీబీ నుంచి రూ.5.45 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడాలోని బ్యాంకులో రూ.7,03,500, మరో చోట రూ.11,500 డ్రా చేశారు. విచారణలో చెక్కులు ఫోర్జరీ చేసినట్లు తేలింది. తన సంతకాన్ని చెక్ చేయకుండా నగదును బదిలీ చేసిన బ్యాంకు మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
దీంతో వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. కాగా, డబ్బులు శ్రీధర్‌బాబు దారి మళ్లించాడని అనుమానిస్తున్నప్పటికీ.. ఇందులో ఉన్నతాధికారులు, సహోద్యోగుల ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి.
