ఇబ్రహీంపట్నం, వెలుగు: అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్ మోహన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 33లో ఐదు అనధికారిక అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు.. వాటిని నిరోధించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలన్నారు. ఈ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని మంచాల మండల పంచాయతీ అధికారిని ఆదేశించారు. కాగా, నోముల పంచాయతీ కార్యదర్శి వి.సుభద్ర దేవిని వేరే మండలానికి బదిలీ చేశారు.
