ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌కు వెచ్చించే.. నిధుల్లో కేంద్రానివే ఎక్కువ: రాణి రుద్రమ

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌కు వెచ్చించే.. నిధుల్లో కేంద్రానివే ఎక్కువ: రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ములో అధిక భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులేనని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందే కేంద్ర నిధులు, హడ్కో ద్వారా కేంద్ర సహకారంతో వచ్చే అప్పులతోనే రాష్ట్రం లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టిందని ఆమె ఆరోపించారు. 9 ఏండ్ల కిందటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మోదీ ప్రారంభించారని ఆమె తెలిపారు.

స్కీమ్ ప్రారంభించిన మొదటి ఏడాదే తెలంగాణలో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి, రూ.5894 కోట్లను కేంద్రం కేటాయించిందని, అయితే  అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు అందకుండా పోయాయని విమర్శించారు. ఇప్పుడు కూడా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ సర్కార్ వాటిని సక్రమంగా ఉపయోగించుకుని పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె సూచించారు.