బెంగళూర్: కాంతార మూవీ మిమిక్రీ వివాదం కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం (మే 26) ఉదయం మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్శనను రణ్‌వీర్ సింగ్ అత్యంత గోప్యంగా ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు నుంచి గర్భగుడిలోకి చేరుకునే వరకు మాస్క్ ధరించారు.
అసలు గొడవ ఏంటంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కాంతార మూవీ మిమిక్రీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో అతడు చేసిన వ్యాఖ్యలు, అనుకరణ పెద్ద వివాదానికి దారితీసింది. రిషబ్ శెట్టి బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' లోని కీలకమైన 'దైవ' సన్నివేశాన్ని రణ్ వీర్ అనుకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు.
దైవాలను 'దైయ్యాలు' అని రణవీర్ మాట్లాడటం మరింత వివాదాస్పదమైంది. ఈ క్రమంలో కన్నడిగుల సంస్కృతిని, తుళునాడు సాంప్రదాయాలను కించపరిచారంటూ బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడంతో రణ్‌వీర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై బేషరతుగా క్షమాపణలు చెబుతూ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు.
రణ్‌వీర్ అభ్యర్థనతో ఏకీభవించిన కర్నాటక హైకోర్టు కేసును కొట్టి వేసింది. కాకపోతే ఒక షరతు పెట్టింది. 4 వారాల లోపు మైసూరు చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం (మే 26) మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన రణ్ వీర్ సింగ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.
