ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎం జ‌గ‌న్ కు కోవిడ్-19 ప‌రీక్ష‌

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎం జ‌గ‌న్ కు కోవిడ్-19 ప‌రీక్ష‌

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకోసం లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సమకూర్చుకుంది. ఈ టెస్ట్ కిట్ తో రక్త నమూనా తీసుకున్న 10 నుంచి 15 నిముషాల్లోనే ఫలితం వస్తుంది. సౌత్ కొరియాలోని ఎస్డీ బయోసెన్సార్ కంపెనీ (సాండర్ మెడికైడ్స్ ద్వారా) తయారు చేసిన లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు శుక్రవారం ఏపీకి చేరుకున్నాయి. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ తో ఈ ఉద‌యం సీఎం జ‌గ‌న్ కు డాక్ట‌ర్లు క‌రోనా ప‌రీక్ష చేయ‌గా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింద‌న్నారు.

దేశంలో RTPCR టెస్ట్ లు చేస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలను కూడా సంప్రదించాక.. సౌత్ కొరియాకు చెందిన ఎస్డీ బయోసెన్సార్ కంపెనీకి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. ఎస్డీ బయో సెన్సార్ ఉత్పత్తి చేస్తున్న ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఆమోదించింది. ప్రామాణికమైన IgM/IgG యాంటీబాడీ ఆధారిత పరీక్ష కూడా యూరోపియన్ CE-IVDచేత ఆమోదించబడింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 20 కంటే ఎక్కువ దేశాలలో అమెరికా, యూరప్ దేశాలలో కోవిడ్-19 అనుమానితుల పరీక్షలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను అత్యవసరంగా దిగుమతి చేసుకునేందుకు వీలుగా సౌత్ కొరియాకు ప్రత్యేక చార్టర్ విమానాన్ని పంపాలని ఎయిర్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎయిర్ ఎండియా 24 గంటల్లోనే ప్రత్యేక చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ విమానం ఢిల్లీకి ఈనెల 16వ తేదీన చేరుకోగా.. అదే రోజు ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 17వ తేదీ ఉదయం విజయవాడకు ర్యాపిడ్ టెక్ట్ కిట్లు చేరుకున్నాయి. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సౌత్ కొరియా నుంచి తక్కువ సమయంలో రాష్ట్రానికి చేర్చడంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను మరిన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కిట్ల ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున పరీక్షించే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.