ఆదిపురుష్​కి అరుదైన గౌరవం

ఆదిపురుష్​కి అరుదైన గౌరవం

ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రం  జూన్ 16న వరల్డ్‌‌వైడ్‌‌గా  విడుదలవుతోంది. ఈలోపే ఈ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ సిటీలో నిర్వహించే ట్రిబెకా చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ‘ఆదిపురుష్’ ఎంపికైంది.

జూన్ 7 నుంచి -18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌‌లో జూన్ 13న న్యూయార్క్‌‌లో ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. విజువల్ ఫీస్ట్‌‌గా రాబోతోన్న ‘ఆదిపురుష్’ త్రీడీ ఫార్మాట్‌‌లో ‘మిడ్‌‌నైట్ ఆఫరింగ్’గా ఈ ఫెస్టివల్‌‌లో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ ‘‘ఆదిపురుష్’ సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, సెంటిమెంట్. భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. ఒక విద్యార్థిగా నేను ఎప్పుడూ ఉండాలని కోరుకునే ప్రపంచంలోని ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో ఒకటైన  ట్రిబెకా జ్యూరీ ఆదిపురుష్‌‌ని ఎంపిక చేసిందని తెలిసినప్పుడు నాతో పాటు టీమ్ అంతా చాలా సంతోషించాము. వరల్డ్ ప్రీమియర్‌‌‌‌లో ప్రేక్షకుల స్పందన చూసి మేము నిజంగా థ్రిల్ ఫీలవుతాం’ అన్నాడు.  సైఫ్‌‌ అలీఖాన్‌‌, సన్నీ సింగ్‌‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్‌‌, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.