తల్లి ప్రేమ: పిల్లల్ని తిడుతున్న పులి వీడియో వైరల్

తల్లి ప్రేమ: పిల్లల్ని తిడుతున్న పులి వీడియో వైరల్

ఈ సృష్టిలో తల్లి ప్రేమ అనేది చాలా నిజమైనది. ఆ ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదు. ఏ తల్లయినా తన బిడ్డలు పెరిగి పెద్దయి ప్రయోజకులవ్వాలనే కోరుకుంటుంది. చిన్నతనంలో గోరుముద్దలు తినిపించి లాలించే అమ్మే..  ఎదిగి ప్రయోజకులుగా మారేందుకు కాస్త కఠినత్వం ప్రదర్శిస్తోంది. ఆ కాఠిన్యం కూడా తన పిల్లల బాగుపడాలనే ఉద్దేశ్యంతో చూపిస్తుంది. మానవుల నుండి అడవి జంతువుల వరకు.. ఈ తల్లి ప్రేమ బిడ్డల విషయంలో ఒకే రకంగా ఉంటుంది. వ్యక్తపరచే భావాలు వేరుగానీ చూపించే ప్రేమ మాత్రం ఒక్కటే.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విటర్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ తల్లి పులి తన రెండు మగ పిల్లలను స్వంతంగా వేటాడమని తిడుతున్నట్టు ఉన్న వీడియో  వైరల్ అవుతుంది. ఆ పులి పిల్లలు రెండున్నర ఏండ్లు వచ్చినా ఇంకా తల్లి వద్దే ఉండడంతో ఆ తల్లి పులి కోపంతో గాండ్రిస్తుంది. సాధారణంగా పులి పిల్లలు పుట్టిన నాటి నుంచి 18 నెలల వయసు తర్వాత తమంతట తాము వేటాడటం తెలుసుకుంటాయి. ఎవ్వరిపై ఆధారపడకుండా తమకు తాము ఆహారాన్ని సమకూర్చుకోగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. కానీ రెండున్నరేళ్లు వచ్చినా  ఆ పులి పిల్లలు ఇంకా తల్లి దగ్గరకే వస్తుండడంతో ఆ మాతృమూర్తికి కోపం వచ్చింది. ఆ ఆన్నదమ్ముల్ని స్వంతంగా వేటాడమని గాండ్రించింది. ఆ అరుపులకు భయపడ్డ ఆ పిల్లలు  ఇక తమంతట తామే ఆహారాన్ని వేటాడాలని నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాయి. ఇందుకు సంబంధించిన 30 సెకన్ల వీడియో ప్రస్తుతం ట్విటర్ లో వైరల్ అవుతోంది.