
మనోహరాబాద్, వెలుగు: ఈనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ రానున్న నేపథ్యంలో జన సమీకరణ కోసం బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత ఉండగా.. కుర్చీల కోసం ఉమ్మడి తూప్రాన్ మండల ప్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, బీఅర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ పురం మహేశ్ మధ్య గొడవ జరిగింది.
బాలకృష్ణారెడ్డి తను కూర్చోవడానికి కుర్చీ లేకపోవడంతో అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మహేశ్ మెట్టు బాలకృష్ణ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. వంటేరు ప్రతాప్ రెడ్డి కలుగజేసుకుని ఇద్దరిని అదుపు చేశారు. కాగా సీఎం నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్తున్నాయి. కాగా ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కూడా బీఅర్ఎస్లో ఉద్యమకారులను పార్టీ పట్టించుకోవడంలేదని, ఉద్యమకారులకు సమాచారం ఇవ్వడంలేదని పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. తాజాగా మరోసారి విభేదాలు బయట పడ్డాయి.