ప్రత్యేక రాష్ట్రం వల్లే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయ్యారు : రసమయి

ప్రత్యేక రాష్ట్రం వల్లే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయ్యారు : రసమయి

తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధి, ఆ రంగాలకు జరిగిన కేటాయింపులపై అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఆసక్తికరంగా మాట్లాడారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తెలంగాణ వచ్చాకే.. కళాకారులు గౌరవప్రదంగా బతుకుతున్నారని… వారికి పింఛన్ ఇచ్చుకుంటున్నామని చెప్పారు.

“సినిమాల్లో హీరోలు ఆంధ్ర తెలుగు భాష మాట్లాడేవాళ్లు. తెలంగాణ రాకముందు… సినిమాల్లో విలన్లకు, జోకర్లకు, గూండాలకు మన భాష వాడేవాళ్లు. మన భాషను అవమానిస్తూ  సినిమాలు తీయడాన్ని మనం చూశాం. మన తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ప్రత్యేకంగా తెలంగాణ చలన చిత్ర మండలిని ఏర్పాటుచేశాం. దానికో చైర్మన్ ను ఏర్పాటుచేసుకున్నాం. తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు తీసిన వారికి ప్రోత్సాహకాలను అందించుకుంటున్నాం. ఇటీవలే వచ్చిన మల్లేశం, దొరసాని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించాయి. నేను నిర్మించిన తుపాకి రాముడు సినిమా కూడా అలాగే ఉండబోతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే.. ఇండస్ట్రీకి మనం ఓ సూపర్ స్టార్ ను అందివ్వగలిగాం. విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మలిచిన చరిత్ర కూడా మన తెలంగాణదే.” అన్నారు రసమయి బాలకిషన్.

తెలంగాణ రాష్ట్రం మరింతగా సాంస్కృతిక పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు రసమయి బాలకిషన్.