చంద్రుడిపై ల్యాండ్​ అయ్యేందుకు సిద్ధంగా 'రషీద్​రోవర్​'

చంద్రుడిపై ల్యాండ్​ అయ్యేందుకు సిద్ధంగా 'రషీద్​రోవర్​'

యూఏఈ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన రషీద్​రోవర్​ ఏప్రిల్​ 25న చంద్రుడిపై ల్యాండ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీన్ని డిసెంబర్​ 2022 లో స్పేస్​ఎక్స్​ రాకెట్​లో చంద్రుడిపైకి ప్రయోగించారు. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ చంద్రుడి పై ల్యాండింగ్​చేయడానికి ప్రయత్నించిన మొదటి ఎమిరేట్​ మిషన్​ ఇది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్​ రోవర్ కావడం విశేషం. జపాన్​కి చెందిన హకుటో‌‌‌‌- ఆర్​ మిషన్​ సాయంతో ప్రయోగించిన ఈ రోవర్​ నెల క్రితం చంద్ర కక్ష్యలోకి చేరుకుంది. ఇందుకోసం  ఐదు నెలల సమయం పట్టింది.  అంతరిక్షంలో 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరం పయనించింది.

రషీద్ రోవర్ అంటే... 

యూఏఈ తయారు చేసిన మొదటి చంద్ర మిషన్​ని ల్యాండ్​ చేయడానికి హకుటో ఆర్​ మిషన్ (రషీద్​ రోవర్​)ని చంద్రుడి ఉపరితలంపైకి పంపారు. దీనిని దుబాయ్​ లోని మహ్మద్​ బిన్​ రషీద్​ స్పేస్​ సెంటర్​లో అభివృద్ధి చేశారు. ఆధునిక దుబాయ్​నిర్మాణానికి కారణమైన దివంగత షేక్​ రషీద్​ బిన్​ సయీద్​ అల్​ మక్తూమ్​ గుర్తుగా దీనికి పేరు పెట్టారు.

ముఖ్య ఉద్దేశం..

చంద్రుడి ఉపరితలంపై రవాణా తదితర అంశాలను కనుక్కునేందుకు ఎమిరాటీ శాస్త్రవేత్తలు రషీద్​ రోవర్​ను రూపొందించారు. నాలుగు చక్రాలు కలిగిన ఇది సెకనుకు 10 సెం.మీ. ల గరిష్ఠ వేగంతో కదులుతుంది.10 సెం.మీ.ల అడ్డంకిని అధిరోహించగలదు. 10 కేజీల బరువున్న ఈ  రోవర్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి.  ఇందులో ఒకటి చంద్రుడి ఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తుంది.  రషీద్‌లోని మైక్రోస్కోపిక్ ఇమేజర్ రెగోలిత్ పొర అధ్యయనానికి, చంద్రుడి చుట్టూ ఉన్న ప్లాస్మా అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఈ మిషన్​ విజయవంతం అయితే చంద్రుడి ఉపరితలంపైకి రోవర్లను పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన యూఎఈ, జపాన్​లు చేరతాయి.