రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం ‘ఆహా’ ఓటీటీలో వెబ్ సిరీస్ కోసం చెప్పాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తే బాగుంటుందని చెప్పా. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. అంత హెవీ పెర్ఫార్మెన్స్ రష్మిక మాత్రమే చేయగలదు. ఈ సినిమాతో ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ వస్తాయి’ అని చెప్పారు. రష్మిక మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది.
మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించా. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్‌తోనే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది’ అని చెప్పింది. ఈ చిత్రంలో తను పోషించిన విక్రమ్ పాత్రను ఎంతగా ఇష్టపడతారో అంతే ద్వేషిస్తారు అని దీక్షిత్ శెట్టి అన్నాడు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ‘ఇంటెన్స్ ఎమోషన్‌తో సినిమా ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారికి బాగా కనెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అని, ప్రతి ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా ఉంటుందని నిర్మాతలు విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని అన్నారు. నిర్మాతలు బన్నీ వాస్, ఎస్‌కేఎన్ పాల్గొని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
