కస్టమర్లకు 300 కోట్ల టోకరా వేసిన గోల్డ్ షాప్ ఓనర్

కస్టమర్లకు 300 కోట్ల టోకరా వేసిన గోల్డ్ షాప్ ఓనర్
  • బంగారం ఇస్తామంటూ డిపాజిట్ల కలెక్షన్
  • రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జ్యువెలరీ షాప్
  • రసిక్‌లాల్ బ్రదర్స్‌ని అరెస్టు చేసిన పోలీసులు

బంగారం.. సగటు భారతీయుడి వీక్‌నెస్.. సెంటిమెంట్ కూడా.. ఆడపిల్ల పుట్టిందంటే చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెంగా గోల్డ్ కొనడం అలవాటు చాలా మందికి.. ఇలాంటి వాళ్ల సెంటిమెంట్‌ను టార్గెట్ చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు ఒకేసారి కట్టక్కర్లేదు.. ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చిన్న మొత్తాల్లో కట్టండి.. బంగారాన్ని సొంతం చేసుకోండి.. అంటూ పేద, మధ్య తరగతి జీవులకు వల వేస్తున్నారు.

డిపాజిట్లు ఫుల్.. దుకాణం బంద్

ముంబైలో ఓ జ్యువెలరీ షాప్‌ డిపాజిట్ స్కీం పేరుతో ఏకంగా రూ.300 కోట్లకు టోకరా వేసింది. జయేశ్ రసిక్‌లాల్ షా (55), నీలేశ్ రసిక్‌లాల్ షా (53) బ్రదర్స్ కలిసి.. ఘట్కేపర్ ప్రాంతంలో రసిక్‌లాల్ సంకల్‌చంద్ జ్యువెలరీ షోరూం నడుపుతున్నారు. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెంగా డబ్బు డిపాజిట్ చేస్తే.. ఒకేసారి భారీ మొత్తంలో బంగారం ఇస్తామంటూ జనాలకు ఆశ చూపించారు. కొన్ని వందల మంది నుంచి రూ.300 కోట్ల డిపాజిట్లు కలెక్ట్ చేశారు. అయితే ఇటీవల బంగారం తీసుకుందామని ఆ గోల్డ్ షాప్ దగ్గరకు వస్తే అక్కడ షాప్ ఆనవాలు కనిపించలేదు. దీంతో మోసపోయామని అర్థమై.. అక్టోబరు 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబై పంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇది పొంజీ స్కీం మోసం కావడంతో ముంబై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి రసిక్‌లాల్ బ్రదర్స్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

జీతాలూ లేవ్..

బోర్డు తిప్పేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారో ఏమో రసిక్‌లాల్ బ్రదర్స్.. గోల్డ్ షాప్‌లో ఉద్యోగులకు జీతాలు దండగ అనుకున్నట్లున్నారు. గడిచిన ఆరు నెలలుగా జ్యువెలరీ షోరూంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో వారం క్రితం రసిక్‌లాల్ బ్రదర్స్‌పై లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.