8 ఏళ్ల బాలుడిని కొరికి గాయపరిచిన ఎలుక

8 ఏళ్ల బాలుడిని కొరికి గాయపరిచిన ఎలుక

హైదరాబాద్లో ఓ ఎలుక ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈ ఘటన మార్చి 8న కొంపల్లిలో  మెక్‌డొనాల్డ్స్  రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. బాలుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  బాలుడి తండ్రి ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడు తన తల్లిదండ్రలతో కలిసి మెక్‌డొనాల్డ్స్  రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ఎలుక రెస్ట్‌రూమ్ నుండి బయటకు వచ్చి నేరుగా ఆ బాలుడి నిక్కర్‌లోకి చొరబడింది.  

దీంతో ఆ బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన అతని తండ్రి కొడుకు నిక్కర్‌లో నుంచి ఎలుకను బయటకు విసిరేశాడు.  అయితే అప్పటికే బాలడి తొడపై ఎలుక గాయం చేసింది.  దీంతో వెంటనే ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, యాంటీ రేబిస్, టెటానస్ టీకాలను వేశారు వైద్యులు. ఆ మరుసటి రోజున బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.