భద్రాద్రిలో వైభవంగా రథసప్తమి.. ఘనంగా సూర్య, చంద్రప్రభ వాహనాలపై సీతారామయ్యకు తిరువీధి సేవ

భద్రాద్రిలో వైభవంగా రథసప్తమి..  ఘనంగా సూర్య, చంద్రప్రభ వాహనాలపై సీతారామయ్యకు తిరువీధి సేవ
  • భక్తులతో భద్రగిరి రద్దీ.. 200 జంటలతో నిత్య కల్యాణం

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రిలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. సీతారామచంద్రస్వామికి సూర్య, చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ చేశారు. ఉదయం గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మంజీరాలను అద్ది తిరుమంజనం చేశారు. అభిషేకం తర్వాత సుందరంగా అలంకరించి విశేష హారతులు సమర్పించారు. బంగారు పుష్పాలతో వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చన చేశారు. ఉత్సవమూర్తులను సూర్యనారాయణమూర్తి అలంకరణ చేసి భక్తుల జయజయధ్వానాల మధ్య సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ చేశారు. విశ్రాంతి మండపం, గోవిందరాజస్వామి ఆలయం వరకు వెళ్లిన స్వామికి భక్తులు అడుగడుగునా మంగళనీరాజనాలు పలికారు.

ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో తిరువీధి సేవ తర్వాత తిరిగి ఆలయానికి స్వామి వచ్చారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం పారాయణం భక్తులు నిర్వహించారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. రికార్డు స్థాయిలో 200 జంటలు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించాయి. ఆన్​లైన్​లోనే 100కు పైగా జంటలు నిత్య కల్యాణం టిక్కెట్లు బుక్ చేసుకోవడం విశేషం. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.

చంద్రప్రభ వాహనంపై స్వామికి సాయంత్రం తిరువీధి సేవను ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామికి వేదోక్తంగాఈ సేవ జరిపించారు. భక్తరామదాసు జయంతి ఉత్సవాల్లో భాగంగా జరగుతున్న వాగ్గేయకారోత్సవాలలో భక్తరామదాసు కీర్తనలను కళాకారులు ఆలపించారు. ప్రఖ్యాత గాయని శ్రీనిధి తిరుమల ఆలపించిన కీర్తనలు అలరించాయి. కాగా, భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వీకెండ్, వరుస సెలవుదినాలు రావడంతో రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు భక్తులు, టూరిస్టులు వెళ్లారు.