రథ సప్తమిరోజు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలి....జిల్లేడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏమిటి.. దీని వెనుక ఆధ్యాత్మికమేనా.. సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా.. అనే విషయాలను తెలుసుకుందాం. . .
రధసప్తమి రోజు (జనవరి 25) జిల్లేడు ఆకులు శరీరం పైన ధరించి తలస్నానం చేసి సూర్యారాధన చేస్తారు. ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అత్యధికంగా గ్రహిస్తుంది. ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అంటారు. అందుకే జిల్లేడు ఆకులను గణపతి పూజలో విశేషంగా వాడతారు. మన పూర్వీకులు మనకు అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారాలతో కలగలిపి అందించారు. ఈ ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి. దీనిని ఆంగ్లలో బెలడోనా అంటారు.
పూర్వం పుండ్లు, గాయాలను నయం చేయడానికి జిల్లేడు చెట్టు నుంచి వచ్చే పాలతో నల్లటి జిగురు పదార్ధాన్ని తయారుచేసి అది ఒక గుడ్డమీద పూసి పుండ్లకు.. గాయాలకు అంటించే వారు. ఈ ప్రక్రియను చిల్లుల పలాస్త్రి అనేవారు. కాస్త వేడిచేసి వ్రణాలపైన అంటిస్తే నెప్పి,వాపు, తగ్గించడంతో పాటు దానిలోని బాక్టీరియాను చంపుతుంది.
ఆరోగ్య పరంగా సూర్యరశ్మి మానవునికి ఎంతో అవసరం. సూర్యునినుండి వెలువడే లేలేత కిరణాలలో విటమిన్ డి నిండి ఉంటుంది. ఇది మానవాళికి ఎంతో అవసరం. అందుకే వైద్యులు సైతం విటమిన్ డి కోసం కొంత సేపు సూర్యునికి ఎదురుగా నిలబడమని చెబుతారు. . పుట్టిన పిల్లలో డి విటమిన్ లోపం రాకుండా సూర్యుడికి ఎదురుగా ఉంచమని చెబుతున్నారు. అందుకే హిందువులు సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. యోగాలో ఒక భాగమైన సూర్య నమస్కారాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
ఇంత విజ్ఞానాన్ని మనకు ఆచారాల రూపంలో అందించారు. మన ఆచారాలు సంప్రదాయాలు వైజ్ఞానిక దృష్టితో ఏర్పరచబడ్డాయి. వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ మన ముందు తరాలకు అందించవలసిన గురుతర బాధ్యత మనపైన ఎంతైనా ఉందని మరచిపోవద్దు కదా.. మరి..!
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
